May 13, 2011

EAMCET EXAMINATION PREPARATION TIPS

లైఫ్
లాస్ట్‌ మినిట్‌ ప్రిపరేషన్‌ దగ్గర పడ్డ ఎమ్‌సెట్‌
డా|| కేశిరాజు రామ్‌ ప్రసాద్‌ ఎడ్యుకేషనల్‌ సైకాలజి కౌన్సిలర్‌
- Sat, 29 May 2010, IST


ఎమ్‌సెట్‌ 2010 లో 3,80,000 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోబోతున్నారు. పరీక్షకు సంబంధించిన ఎంత ధృక్పథం, జ్ఞానం, నైపుణ్యాలు వున్నా వ్యూహాలు, మెలకువలు అవసరమని పలువురు మానసిక శాస్త్ర వేత్తలు చెబుతుంటారు. సరైన వ్యూహమే విజయాలని సాధించిపెడుతుంది. పరీక్ష సమయానికి నిముషం ఆలస్యంగా వచ్చినా పరీక్షరాసే అవకాశం వుండదు కాబట్టిపరీక్షా కేంద్రానికి కాస్త ముందుగా చేరుకోవాలి. పరీక్ష రాయడానికి హార్డ్‌ వర్కే కాదు. స్మార్ట్‌ వర్క్‌ కావాలి. ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలలో చదివే తీరు ఎమ్‌సెట్‌ చదివే తీరుకి చాలా తేడా వుంది. ఇంటర్‌ పరీక్షలలో 90 శాతం కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నవారు ఎమ్‌సెట్‌లో మంచిస్కోరు సాధించలేకపోవడాన్ని చూస్తునే ఉన్నాం. దీనికి కారణం పరీక్ష ప్రిపేర్‌ అయ్యే విధానంలోని లోటుపాట్లు. లెక్కలు, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటని, జువాలజీలలో టెస్టుబుక్‌ని సమగ్రమైన, సునిశితమైన పరిశీలనతో అర్థం చేసుకొంటూ, విశ్లేషాత్మకంగా చదవడం చాలా ముఖ్యం. పరీక్ష రాసేటప్పుడు ఈ విషయాలు దృష్టిలో ఉంచుకోండి.

సమయపాలన:
160 ప్రశ్నలు పూర్తి చేయడానికి వుండే సమయం 180 నిమిషాలు. ఒక పథకం ప్రకారం రాస్తే తప్ప ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయలేం. ప్రతీ జవాబుకు వుండే సమయం సుమారు 1 నిముషం కాబట్టి ఒక జవాబుకి ఎక్కువ సమయం తీసుకోకూడదు. మొదటిసారి ప్రశ్నాపత్రం చదివేటప్పుడు బాగా వచ్చిన జవాబులు అన్ని విభాగాలలోను పూర్తి చేయాలి. రెండోసారి మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలను నిశితంగా చదువుతూ ఆప్షన్స్‌ ఎలిమినేట్‌ చేస్తూ సరియైన జవాబులు పూర్తి చేయాలి. మూడోసారి ప్రశ్న పత్రం చదువుతున్నప్పుడు అందుబాటులో వుండే సమయాన్ని బట్టి క్లిష్టమైన జవాబులు పూర్తి చేయాడానికి ప్రయత్నం చేయాలి. క్లిష్టంగాను, పెద్దవిగా వున్న ప్రశ్నలకు, మొదటి రీడింగ్‌లోనే జవాబులు రాయాలన్న ప్రయత్నం సరికాదు. పరీక్ష సమయంలో మంచి వాచీ పెట్టుకోవాలి. అలా అని తరచూ వాచినీ చూస్తూ బిపి పెంచుకోకూడదు.
ఒఎమ్‌ఆర్‌ షీటులో జవాబులు చుట్టడం:
ప్రశ్నకు తగిన జవాబు వద్ద రౌండ్‌ చేయాలి. చాలా మంది విద్యార్థులు కంగారులో ఒక జవాబుకి రౌండ్‌ చుట్టబోయి తరువాత జవాబుకి చుడతారు. చివరలో గాని దీన్ని పరిశీలించలేరు. ఒక్కోసారి ఈ తప్పుని పట్టుకోలేకుండా పరీక్ష హాలునుండి బయటికి వచ్చేయవచ్చు. ఈ విషయంలో జాగ్రత్త చాలా అవసరం.
ప్రశ్నను సరిగా అర్థం చేసుకోవాలి:
ప్రశ్నను అర్థం చేసుకొంటూ చదవాలి. సమాధానాన్ని సరిగా ఎంచుకోవాలి. ఒక్కోసారి అన్ని జవాబులు సరియైనవిగా అనిపిస్తుంటాయి. ఎలిమినేషన్‌ పద్ధతి ద్వారా సరికాని వాటిని తీసివేయాలి.
ప్రిపరేషన్‌:
పరీక్షలో విజయానికి తొలి మెట్టు ప్రిపరేషన్‌. విజయం దాని మీదే ఆధారపడుతుంది. పరీక్ష సమయంలో వచ్చే ఆందోళన, నీరసం, కన్ఫ్యూజన్స్‌, గ్లాని నుంచి తప్పించుకోవాలి. ఎవరైతే సక్రమంగా పరీక్షకు సిద్ధం అవుతారో వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా వుంటుంది. వారు ధైర్యంగా, ప్రేరణతో పరీక్ష రాస్తారు

అని మానసిక శాస్త్ర నిపుణులు చెబుతారు. పరీక్షకు ముందు నుంచి సిద్ధం కావాలి. చివరలో చదవుదామని చేసే ప్రయత్నం ఎప్పుడూ విజయవంతంకాదు. ముందు నుంచి చదవడం ఎక్కువ సార్లు చదవడం వల్ల జ్ఞాపకశక్తి బలపడుతుంది. బాగా గుర్తు వుంటుంది. చదవడం, తరగతి గదిలో వినడం, సందేహాలు నివృత్తి చేసుకోవడం చాలా ప్రధానమైన అంశం. చదివిన అంశం బాగా గుర్తు వుండాలంటే ఒక టెక్నిక్‌ వుంది ఈ రోజు చదివిన లేక విన్న అంశాన్ని మరుసటి రోజు ఒకసారి చదవాలి. వారం రోజులు, 15 రోజులు, ఒక నెల, మూడు, ఆరు నెలల తరువాత ఒక్కోసారి చదవడం జరిగితే ఆ విషయాన్ని మరచిపోవడం జరగదు. ఇలా చదివి చూడండి. మంచి ఫలితాలు పొందవచ్చు.
మైనస్‌ మార్కులు లేవు:
సాధ్యమైనంతవరకు మీరు మొదటిసారి ఎంచుకొన్న జవాబు ఖచ్చితమై వుంటుంది. రెండోసారి సరిచూసుకొనేటప్పుడు మార్చాలనే ఆలోచన వస్తే జాగ్రత్తగా గమనించి మార్చండి. మైనస్‌ మార్కులు ఎటూ లేవు కనుక తెలియని జవాబులను విజ్ఞతతో గెస్‌ చేసి పూర్తి చేయండి. ప్రతీ ప్రశ్నా అటెంప్ట్‌ చేయండి. దేన్నీ విడిచిపెట్టవద్దు. ఒక్కొక్కసారి ఇంగ్లీష్‌ గ్రామర్‌ ఉపయోగపడుతుంది. జవాబుకి ముందు ప్రశ్న ఎ, యాన్‌ లతో అంతమైతే, జవాబు ఒవెల్స్‌తో ప్రారంభమవుతుంది. ఇది జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. జవాబు పెద్దగా కనబడితే అది తప్పేమో అని అనుకోవద్దు. మీ చాకచక్యాన్ని గమనించడానికి విశేషణాలతో, క్లాజులు,ఫ్రేజులతో సమాధానాన్ని పెంచుతారు. ప్రశ్న చదవకుండా కొంత మంది జవాబులు చూస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. అన్ని ప్రశ్నలు సులువుగా వుండవు. కొన్ని అతిక్లిష్టమైన ప్రశ్నలు వుంటాయి. అందువల్ల ఏకాగ్రతతో క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం రాయండి.

మోడల్‌ పేపర్స్‌ చేయండి:
ఇందువల్ల ఏ ఏ అంశాలలో తప్పులు చేస్తున్నామో గ్రహించుకోవచ్చు. ఏ భాగంలో సరియైన జవాబులు రాయలేకపోతుంటే దాని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఎక్కువ సమయాన్ని దానికి కేటాయించాలి. ప్రశ్న సరిగా చదవక తప్పులు పెడుతుంటే కొంచెం సమయం తీసుకొని ప్రశ్నలు శ్రద్ధగా చదవాలి. అవగాహన, విశ్లేషణ, వైరుధ్యం, పోలిక, సాదృశ్యం, విభేదం, నైపుణ్యం, అంచనా, నిత్య జీవితంలో ఉపయోగం లాంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని విశ్లేషించుకొంటూ సమాధానాలను గుర్తుపట్టాలి. ఏ పరీక్ష బాగా రాయాలన్నా రివిజన్‌ చాలా అవ సరం. ఎన్ని ఎక్కువ సార్లు రివిజన్‌ చేస్తే అంత బాగా గుర్తుంటుంది. ఫార్ములాలు, సూత్రాలు, ఈక్వేషన్స్‌, లెక్కలు లాంటివి ఎన్ని సార్లు రివిజన్‌ చేస్తే అంత మంచిది.

ధైర్యం:
పరీక్షల సమయంలో మనోధైర్యం కోల్పోకూడదు. ప్రతీ ఒక్కరూ శక్తి వంచనలేకుండా కృషి చేయాలి. బాగా చదివితే పరీక్ష అద్భుతంగా రాస్తాం. ప్రిపరేషన్‌ చివరిక్షణంలో కంగారుకొద్దీ మరిచిపోయినట్టు అనిపించినా పరీక్ష రాస్తున్నప్పుడు అవే గుర్తుకు వస్తాయి. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో కొత్త అంశాలు నేర్చుకోవడం కన్నా వీలైనన్ని సార్లు రివిజన్‌ చేయడం మంచిది. కొత్త మెటిరియల్‌ జోలికి పోవద్దు. అందులో ప్రశ్నలు, మోడల్‌ పేపర్స్‌ చేయడం వల్ల ఒక్కోసారి అవి కష్టంగా వుంటే ధైర్యాన్ని కోల్పోవచ్చు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకూడదు. పరీక్షలకు ముందు రెండు రోజులు మీరు రాసిన పాత పేపర్స్‌ చూసుకోవడం, అందులోని సమ్స్‌నే చేసుకోవడం మంచిది.
ప్రతి అంశంలోని ముఖ్యమైన చాప్టర్స్‌:
కెమిస్ట్రిలో మొత్తం 40 మార్కులుంటాయి. మొదటి సంవత్సరం ప్రాబ్లమ్స్‌, ఈక్వేషన్స్‌ మీద 17 మార్కులు, రెండో సంవత్సరంలో ప్రాబ్లమ్స్‌, ఈక్వేషన్స్‌ మీద 23 ప్రశ్నలుంటాయి. ఆర్గానిక్‌ కెమిస్ట్రిలో 8 నుంచి 10 మార్కులు, ఈక్వేషన్స్‌ మీద 6 నుంచి 8 మార్కులు వుంటాయి. ఇక థిరిటికల్‌ టాపిక్స్‌ అయిన బయోమ్యాలికల్స్‌, పాలిమర్స్‌, నిత్య జీవితంలో కెమిస్ట్రి, నోబుల్‌ వాయువులు, ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రిలో ఒక్కొక్క ప్రశ్న వుంటాయి. టెస్టుబుక్‌ చదవడం చాలా ముఖ్యం. ఫిజిక్స్‌లో లెక్కలుంటాయి కాబట్టి ప్రశ్నను అర్థం చేసుకోవాలి. ప్రశ్నలో వున్న హింట్‌ని అర్థం చేసుకున్నాకే జవాబు పెట్టాలి. ఏ చాప్టర్స్‌ బాగా వచ్చో ఆ ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తూ పోవాలి. ప్రశ్న చదివేటప్పుడు హింట్‌ దొరకకపోతే దానిని వదిలేసి ముందుకు పోవాలి. 2005 తరువాత మోడల్‌ పేపర్స్‌ 3 లేక 4 పేపర్స్‌ సమాధానాలు విశ్లేషాత్మకంగా తెలుసుకోవాలి. చాప్టర్‌ తరువాత ఇచ్చిన క్వశ్చన్స్‌ చదవటం మంచిది. ముఖ్యంగా తెలిసిన ఫార్ములాస్‌ని ప్రాబ్లమ్స్‌కి అప్లై చేయటం తెలుసుకోవాలి. దీనికి పాత పేపర్లు చదవడం సహాయపడుతుంది. హీట్‌ మెకానిక్స్‌ పోఫర్టిస్‌ ఆఫ్‌ మేటర్‌, వేవ్‌మోషన్స్‌, ఆప్టిక్స్‌, విద్యుత్‌, ఆటమిక్‌ ఫిజిక్స్‌ బాగా చదవండి. అన్ని చాప్టర్స్‌కి సమాన ప్రాధాన్యత ఇవ్వండి.
ఫండమెంటల్స్‌:
ఫండమెంటల్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎక్కువ పుస్తకాలు చదవడం గొప్పకాదు. చదివింది అర్థవంతంగా మలచుకోవడమే గొప్పతనం. జువాలజీ, బోటనీలో ఎకాడమీ బుక్స్‌ చాప్టర్‌ ప్కారం, ఇంకా చెప్పాలంటే లైన్‌ బై లైన్‌ చదవడం మంచిది. చాప్టర్‌ చివరలలో ఇచ్చిన కీ పాయింట్స్‌ చిన్న ప్రశ్నలు, క్విజ్‌ ప్రశ్నలు, మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు చూసుకొంటే సరిపోతుంది.
క్లిష్టమైన అంశాలు:
ఒక్కోసారి జవాబులో ''పైవన్నీ లేక పైవేవికావు'' అనే అంశాలు వుంటాయి. ఇలాంటి ప్రశ్నలు కొంచెం కన్‌ఫ్యూజ్‌ చేస్తాయి.అప్పుడు మిగతా ఆప్షన్స్‌ని బట్టి సమాధానాల్ని గుర్తించాలి. ఒక్కోసారి ప్రశ్నలలో వ్యతిరేక అర్థం వచ్చే లేదు, కాదు, ఎప్పుడూ లేదు, లేక ఏదికాదు అనే అర్థం వచ్చే పదాలు వుంటాయి. జాగ్రత్తగా ప్రశ్నను బట్టి చదివి సమాధానాన్ని గుర్తించండి. ఒక్కోసారి జవాబులను బట్టి ప్రశ్నను గుర్తించవచ్చు. ఒక్కోసారి, ఎప్పుడూ, ఒకటే, ఎక్కువ సార్లు అనే పదాలు వచ్చినప్పుడు ఖచ్చితమైన వివాదం లేని సత్యం అయివుంటుంది జవాబు. గురుంచుకోండి. సరదా జవాబులు ఎప్పుడూ తప్పుగా వుంటాయి.
''పైవన్నీ'' అనే జవాబు ఎక్కువ సార్లు సరియైంది అయి వుండచ్చు. అప్పుడు ఇచ్చిన ఆప్షనల్స్‌లో రెండు సరియైన జవాబులు వుంటే మూడో ఆప్షన్స్‌ని చూడాల్సిన అవసరం లేదు. ''పైవన్నీ'' సరియైన జవాబు అవుతుంది. ''ఏదీకాదు'' సరియైన జవాబు చాలా సార్లు కాకపోవచ్చు. జాగ్రత్తగా పరిశీలించండి. ఎసెర్షన్‌, రీజనింగ్‌కి చెందిన ప్రశ్నలను సమయం వుంటేనే రాయండి లదా వదిలేయండి. ఎక్కువ సమయం దీనికి కేటాయించవద్దు. మేచింగ్‌లో రెండు జవాబులు ఒకేలా వుంటాయి. అప్పుడు రెండు అప్షన్స్‌ సరియైనవి కావు. మిగతా రెండు ఆప్షన్స్‌ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏది సరియైనదో తెలుస్తుంది. దీని వల్ల సమయం కలసి వస్తుంది.
టైమ్‌ మేనేజ్‌మెంట్‌:
పరీక్ష తేదికి ముందు 4 రోజులు చాలా ప్రధానమైనవి. ఈ సమయంలో ప్రతీ సబ్జెక్టుకి ఇంత సమయమని కేటాయించుకోండి. ఆ సమయం అయిపోయిన వెంటనే మరో సబ్జెక్టుని తీసుకోండి. తప్ప అదే అంశాన్ని కొనసాగించవద్దు. బాగా వచ్చిన సబ్జెక్ట్‌ని ముందు చదవండి. ఏ ఏ అంశాలలో ఎక్కువ తప్పులు చేస్తున్నారో ఆ అంశాలను మరింత ఎక్కువ చదవండి. ఏ ఏ అంశాలపై ఎక్కువ మార్కులు వస్తుంటే ఆ అంశాలపై మరింత శ్రద్ధ వహించాలి.
గ్రూప్‌ స్టడీస్‌:
ఇది చాలా మందికి మంచి పద్ధతి. దీని వల్ల సమయం, శ్రమ కలసివస్తాయి. గ్రూపులో మిత్రులు టాపిక్స్‌ని విడదీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్‌ని విశ్లేషాత్మకంగా చదువుకొని మిగతా వారికి దాని సారాంశాన్ని వివరించాలి. ఇలా ఇతరులకి చెప్పడం వల్ల పాఠ్యాంశాల పట్ల ఎక్కువ పట్టు పెరుగుతుంది. ఇతరులకి చెప్పడం వల్ల కొత్త అంశాన్ని నేర్చుకోవచ్చు. ప్రశ్నలు ఒకరిని ఒకరు అడగటం ద్వారా బ్రెయిన్‌ స్టార్మింగ్‌ జరుగుతుంది.
మోడల్‌ పేపర్స్‌:
చివర మూడు రోజులు 2005 నుంచి ఇచ్చిన మోడల్‌ పేపర్స్‌ని చేయడం, జవాబులను తులనాత్మకంగా పరిశీలించడం, విశ్లేషిచుకోవడం ద్వారా మెదడుని పరీక్షకు సంసిద్ధం చేయవచ్చు. పరీక్ష ముందు పేపర్స్‌ చేయడం వల్ల పరీక్ష రోజు పరీక్ష భయం వుండదు. మెదడుని పరీక్షకు సంసిద్ధం చేయడం ఇందులో ప్రధానమైన అంశం. పరీక్షకు సిద్ధంగా వుండటం ద్వారా వివిధ జ్ఞానాలను, నైపుణ్యాలను పరీక్ష సమయంలో వినియోగించుకోవడం అవసరం. ఎవరు విద్యా నైపుణ్యాలను పరీక్ష సమయంలో సమర్దవంతంగా ఉపయోగించుకుంటారో వారే విజేతలవుతారు.

Dr.KESIRAJU RAMPRASAD
EDUCATIONAL PSYCHOLOGIST

No comments:

Post a Comment

Addressing gathering in Chambers college,Plalkolk in Jawahar Knowledge centre